
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉదయ్ స్కీమ్‌లో చేరడం వల్ల వినియోగదారులకు నష్టం లేదని విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తాము అధికారంలో ఉన్నపుడు ఆ స్కీమ్కు సంబంధించి కేంద్రంతో చేసుకున్న ఒప్పంద పత్రాన్ని అసెంబ్లీకి తీసుకొచ్చి సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఒప్పందంలో ఉన్న కొంత భాగాన్ని చదివి, మరికొంత భాగాన్ని చదవకుండా ప్రజలను, సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్లో మీడియాతో జగదీశ్ రెడ్డి మాట్లాడారు. తమ మెడపై కత్తి పెట్టి రైతుల మోటార్లకు మీటర్లను పెట్టాలన్నా మాజీ సీఎం కేసీఆర్ ఒప్పుకోలేదని తెలిపారు.